నేడు వరంగల్‌కు నితిన్‌ నబీన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు వరంగల్‌కు నితిన్‌ నబీన్‌

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం

హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా సోమవారం వరంగల్‌ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్‌లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌ రెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్‌, చాడా శ్రీనివాస్‌ రెడ్డి, రావుల కిషన్‌, డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్‌, కుసుమ సతీశ్‌, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement