కమలాపూర్ : అసోంలో జరిగిన కామాక్యదేవి జాతరకు వెళ్లొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన కళ్లెం శ్రీనివాస్(50), చల్లా వెంకటేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన తూర్పాటి భార్గవ్(35), హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన తూర్పాటి హరిబాబు కలిసి అసోంలో ఇటీవల జరిగిన కామాక్యాదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉప్పల్‌లో అదుపు తప్పి ఓ ఇంటి గోడను ఢీకొని డ్రైనేజీలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తూర్పాటి భార్గవ్, సీహెచ్.వెంకటేష్, తూర్పాటి హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కమలాపూర్, నడికూడ 108 అంబులెన్స్‌ల్లో వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తూర్పాటి భార్గవ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మృతుడు కళ్లెం శ్రీనివాస్ కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నవీన్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉప్పల్‌లో ఘటన


