నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్‌

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్‌

బచ్చన్నపేట/ నర్మెట : నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేటలో గతంలో పని చేసి వీఆర్‌ఎస్‌కు అటాచ్డ్‌ అయిన ఎస్సై ఎస్‌కే అబ్దుల్‌ హమీద్‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో బచ్చన్నపేట ఎస్సైగా వచ్చిన హమీద్‌ దాదాపు 16 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. సుమారు నాలుగు నెలల క్రితం మండలంలోని సాల్వాపూర్‌ గ్రామ సమీపంలో పీడీఎఓస్‌ బియ్యం పట్టుకుని నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. కానీ పట్టుకున్న మొత్తం బియ్యం చూపించకుండా తక్కువ తూకం నమోదు చేశారనే విషయంలో సీఐ, ఎస్సైలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేయగా ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌ అధికారులతో విచారణ చేయించారు. ఇందులో పీడీఎస్‌ బియ్యం తక్కువ తూకం నమోదు చేశారనే విషయం నిరూపణ అయ్యింది. దీంతో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్‌హమీద్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న హమీద్‌..

ఎస్సై ఎస్‌కే అబ్దుల్‌హమీద్‌ పలు చోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేవరుప్పుల మండలంలో పని చేసిన సమయంలో కూడా ఏసీబీ ట్రాప్‌నకు అయ్యారు. ఆ తర్వాత వీఆర్‌ అటాచ్డ్‌ అయి బచ్చన్నపేటకు వచ్చినప్పటి నుంచి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల పోచన్నపేట గ్రామ వాగు నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలించడానికి కొంత మొత్తాన్ని ఆశించారని సీపీకి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణ వాస్తవమని రుజువు కావడంతో వీఆర్‌కు అటాచ్డ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. తిరిగి పీడీఎస్‌ బియ్యం ఆరోపణ కూడా నిరూపణ కావడంతో ఏకంగా సస్పెండ్‌ చేశారు.

బచ్చన్నపేటలో సస్పెండ్‌ల పర్వం..

బచ్చన్నపేటలో పని చేసిన పలువురు పోలీసు అధికారులు సస్పెండ్‌ అయ్యారు. 2024లో పని చేసిన అప్పటి ఎస్సై నవీన్‌కుమార్‌ కూడా ఓ కేసు విషయంలో సస్పెండ్‌ అయ్యారు. ఆ సమయంలో ఉన్న నర్మెట సీఐ నాగబాబు మరో కేసులో సస్పెండ్‌ అయ్యారు. ఇప్పుడు పీడీఎస్‌ బియ్యం విషయంలో సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్‌ ఇద్దరూ సస్పెండ్‌ అయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement