హన్మకొండ: పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు హనుమకొండ, వరంగల్ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం పేదలతో కలిసి ర్యాలీ ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద పేదలతో కలిసి వామపక్ష పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం ఇక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలికి చేరుకోగానే మరోసారి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు మరికొందరు నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు వాహనంలో నాయకులను తరలిస్తుండగా కార్యకర్తలు, పేదలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జూలై 1న హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ఎదటు పికెటింగ్, 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద దర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, షేక్ బాష్ మియా, సీపీఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు జి.ప్రభాకర్ రెడ్డి, సీహెచ్ రంగయ్య, నాయకులు నేదునూరి జ్యోతి ఉన్నారు.
తెలంగాణ అమరవీరుల
స్తూపం కూడలిలో బైఠాయింపు
కార్యకర్తలు, పోలీసుల మధ్య
తోపులాట, వాగ్వాదం
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, నాయకుల అరెస్ట్


