ప్రబలేదాకా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

ప్రబలేదాకా పట్టించుకోరా?

Jun 27 2026 12:49 AM | Updated on Jun 27 2026 12:49 AM

ప్రబలేదాకా పట్టించుకోరా?

వరంగల్‌ అర్బన్‌: వర్షాకాలం ప్రారంభమైంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు, అతిసారా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఏటా జూన్‌ మొదటి వారంలోనే సీజన్‌ వ్యాధులపై ముందస్తుగా అప్రమత్తం కావాలి. బల్దియా, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్‌ సిబ్బంది, సామాజిక కళాకారులతో కలిసి ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఇంతవరకు కార్యాచరణ లేదు. వ్యాధులు విజృంభించిన తర్వాత మందులు ఇచ్చే కన్నా ముందు జబ్బులు రాకుండా నివారించగలిగితే అందరికీ ఎంతో ప్రజయోజనమని మహానగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కనిపించని చర్యలు..

ప్రజారోగ్య విభాగం, అర్బన్‌ మలేరియా విభాగం ఉమ్మడిగా గ్యాంగ్‌వర్క్‌ చేయాలి. 66 డివిజన్ల వారీగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి. ఎందుకో రెండేళ్లుగా ఇలాంటి చర్యలేమీ కనిపించడం లేదు. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తే పేరుకుపోయి కనిపిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా.. సాధారణ పారిశుద్ధ్య పనులు చేయట్లేదు. వారానికోసారి మురుగు కాల్వలు తీయట్లేదు. డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు ప్రైవేట్‌ శానిటేషన్‌ కార్మికులతో గ్యాంగ్‌వర్క్‌ నిర్వహించేవారు. ఈసారి ఆలస్యంగా మొదలు పెట్టారు. కొన్ని డివిజన్లలో ఇంతవరకు గ్యాంగ్‌వర్క్‌ ప్రారంభం కాలేదు. కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దోమల బెడద తప్పదా?

నగరంలో దోమల బెడద తప్పేలా లేదు. వర్షాకాలం మొదలైంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దోమల తీవ్రత పెరిగింది. వాస్తవానికి లార్వా దశలోనే దోమల ఉత్పత్తి పెరగకుండా చూడాలి. దోమల నివారణ అర్బన్‌ మలేరియా విభాగానికి పెను సవాలే. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌, విలీన గ్రామాల్లోని పలు కాలనీల నుంచి దోమలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. వీటి నివారణ కోసం అర్బన్‌ మలేరియా సిబ్బంది బృందాలుగా ఏర్పడి డివిజన్ల వారీగా గ్యాంగ్‌వర్క్‌ చేయాలి. అందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను ఇంతవరకూ తయారు చేయలేదు. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో మలేరియా సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే దోమల నివారణ సాధ్యమవుతుంది. దోమల ఉత్పత్తి పెరగకుండా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంటింటా తిరగాలి. డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలితే వెంటనే అర్బన్‌ మలేరియా సిబ్బంది రంగంలోకి దిగాలి. ఆ దిశగా చర్యలేమి లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆరోగ్య శిబిరాల ఊసే లేదు

నగరంలో అధికారికంగా 185 మురికివాడలు, విలీన గ్రామాల్లో 80 మురికివాడలు ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలతోపాటు పేదలుంటున్న కాలనీల్లో ఉచిత వైద్యశిబిరాల కోసం షెడ్యూల్‌ ప్రకటించాలి. రోగాలపై కళాకారులతో ప్రజలను జాగృతం చేయాలి. కానీ, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంతవరకు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే.

అర్బన్‌ మలేరియా విభాగానికి సుస్తీ..

బల్దియా అర్బన్‌ మలేరియా విభాగం 14 నెలలుగా అనారోగ్యం బారిన పడింది. మలేరియా అధికారి మాధవరెడ్డి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. దీంతో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బల్దియాలో ఇద్దరు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు హెల్త్‌ అసిస్టెంట్లు, 160 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిపై రోజువారీగా పర్యవేక్షణ కరువైంది. కనీసం రోజువారీగా బావుల్లో మందు వేయడం, డ్రెయినేజీల్లో రసాయనాలు చల్లడం, ఖాళీ స్థలాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, ఫాగింగ్‌ చేయడం వంటి పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బయాలజిస్ట్‌ పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కార్యాచరణ రూపొందిస్తున్నాం..

నగరంలోని చాలాకాలనీల్లో 8 వేల వరకు ప్రైవేట్‌ ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో పిచ్చి మొక్కలు పెరిగి, మురుగునీరు స్తంభించిపోయి దోమల ఉధృతి పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అన్ని విభాగాల సహకారం తీసుకుంటాం.

– రాజారెడ్డి, ఇన్‌చార్జ్‌ బయాలజిస్ట్‌

హనుమకొండ

రాగన్న దర్వాజ

ప్రధాన రహదారిపై

పారుతున్న మురుగు నీరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement