డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి: సీపీ | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి: సీపీ

Jun 27 2026 12:49 AM | Updated on Jun 27 2026 12:49 AM

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి: సీపీ బస్‌స్టేషన్‌ పనుల్లో నిర్లక్ష్యం వద్దు ఇద్దరు ఎస్సైల బదిలీ నేడు శనిత్రయోదశి పూజలు

వరంగల్‌ క్రైం: డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్‌ జోన్‌ పోలీసులు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్‌ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ చౌరస్తా: నూతన హంగులతో రోల్‌ మోడల్‌గా నిర్మిస్తున్న వరంగల్‌ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తగదని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.75 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న వరంగల్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్‌ బస్‌ స్టేషన్‌ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పనుల్లో మరింత వేగం పెంచాలని సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను, అధికారులను ఆయన హెచ్చరించారు. వరంగల్‌ నగరాన్ని అద్భుతమైన ఐటీ, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థ ఎంతో కీలకమని, ఇందుకోసం ‘కుడా’ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషరేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఈ.వీరభద్రరావును దామెర ఎస్‌హెచ్‌ఓగా, దామెర ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న కె.అశోక్‌ను ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: శనిత్రయోదశి పుస్కరించుకుని శనివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనిపూజలు, నవగ్రహ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

వసతుల కల్పనే లక్ష్యం

గీసుకొండ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీ 15, 16వ డివిజన్లలో హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌, మాజీ మేయర్‌ గుండు సుధారాణితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రతిపాదనల స్వీకరణ

కాళోజీ సెంటర్‌ : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ పాఠశాల విభాగం న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రతిపాదనలు కోరుతున్నట్లు వరంగల్‌ డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు జూలై 10వ తేదీలోపు http:nationalawa rdstoteachers.education.gov.in ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌ ప్రింట్‌ ప్రతులు రెండు సెట్లు ఆయా మండల విద్యాశాఖ అధికారి ద్వారా జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు తమ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement