విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా టీచర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వర్క్ అడ్జెస్‌మెంట్ చేశారు. అవసరం ఉన్న పాఠశాలలకు విద్యార్థుల నమోదు తక్కువగా ఉండగా.. మిగులు ఉన్న 158 మంది టీచర్లను అడ్జెస్ట్ చేశారు. ఆతర్వాత జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 30 మంది టీచర్లను అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలుగా నియమించారు. ఆయా టీచర్ల స్థానంలో మరో 30 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్ చేశారు. మొత్తం 188 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. తనిఖీ బృందాల్లోని 30 మంది టీచర్లు ఈ విద్యాసంవత్సరం ప్రస్తుతం తిరిగి తమ పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 158 మంది టీచర్లు గత విద్యాసంవత్సరం ఏ పాఠశాలల్లోనైతే వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద పనిచేశారో ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని యథావిధిగా ఆయా పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు.
29న ఎంఈఓలతో డీఈఓ సమావేశం..
జిల్లాల్లో అవసరం మేరకు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయాలని ఆదేశించారు. టీచర్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌పై ఈనెల 29 హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఎంఈఓల సమావేశం నిర్వహించనున్నారు.
రిటైర్డ్, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్‌మెంట్
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ఉత్తర్వులతో అధికారుల కసరత్తు


