హన్మకొండ అర్బన్/విద్యారణ్యపురి: 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించి, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ–475) రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) భవన్‌లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంలో జాప్యం కొనసాగితే.. చేపట్టే ప్రతీ ఉద్యమానికి టీజీఓ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల మంజూరు తదితర డిమాండ్లపై పలు తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీఓ నాయకులు ఆసనాల శ్రీనివాస్, డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, టీజీజేఎల్‌ఏ నాయకులు జె.కురుమూర్తి, శోభన్‌బాబు, శ్రీనివాస్, రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


