విద్యారణ్యపురి/కాళోజీసెంటర్: పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ సెంటర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ జిల్లా బాధ్యులు అదనపు కలెక్టర్ రవి, వరంగల్ జిల్లా బాధ్యులు డీఆర్‌ఓ విజయలక్ష్మికి వినతిపత్రం ఇచ్చారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్‌కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు సీహెచ్.రవీందర్‌రాజు, తాటికాయల కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీలు పెండెం రాజు, సుజన్‌ప్రసాద్‌రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, జిల్లా కోశాధికారి రవూఫ్, రెండు జిల్లాల బాధ్యులు లింగారావు, మోజెస్, రమేశ్ సీఎస్‌ఆర్ మల్లిక్, ప్రసన్నానంద్, కరుణాకర్, భాస్కర్‌రావు, గిరి ధరాచారి బ్రహ్మచారి, సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 187 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 173 మంది ఉత్తీర్ణత (93.35 శాతం)సాధించారని జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ మధుసూదన్‌రావు తెలిపారు.
వరంగల్ జిల్లాలో 86.88 శాతం ఉత్తీర్ణత
కాళోజీ సెంటర్: సప్లమెంటరీ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 86.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 503 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 437 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 208 మంది బాలికల్లో 185 మంది, 295 మంది బాలురలో 252 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ, సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ (సీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరుతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ బాలయ్య హాజరై మాట్లాడారు. వన్యప్రాణుల ప్రవర్తన, వాటి వల్ల మానవాళికి తలెత్తే సంఘర్షణలు, వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏసీ రాజేందర్, ఆర్‌ఐలు రవి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, కృష్ణ, సురక్ష త్రివేణి, సిబ్బంది పాల్గొన్నారు.
రామన్నపేట: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎస్డీ రాంకుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో సేవలందిస్తున్న సిబ్బంది, ఎవరెవరు ఎక్కడ సేవలందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సెలవు, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం రంగంపేట–3 అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించారు. నమోదైన గర్భిణుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ప్రోత్సహించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించారు. తర్వాత హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. రెండు నెలలుగా ఎంతమందికి సేవలందించారు. ఎక్కువగా ఏ సమస్యలతో అక్కడికి వచ్చారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికవరీకి సంబంధించిన రికార్డులు ఆయన పరిశీలించారు. జీఎంహెచ్ ఆర్‌ఎంఓ మంజుల, పిల్లల వైద్య నిపుణులు సుభాష్, ప్రశాంత్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, మురళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


