‘సర్‌’లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో భాగస్వాములు కావాలి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

‘సర్‌’లో భాగస్వాములు కావాలి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో ఓటర్లు భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తన కుటుంబ సభ్యుల వివరాలను ఇంటింటి గణన ఫారంలో స్వయంగా నమోదు చేసి బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో పాటు గణన ఫారాలను అందజేస్తారని చెప్పారు. అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతం కావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోరారు. హనుమకొండ ఎన్నికల నాయబ్‌ తహసీల్దార్‌ విఠల్‌, ఆర్‌ఐ దశరథ్‌రాంరెడ్డి, సూపర్‌వైజర్‌, బీఎల్‌ఓ విజయ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ తహసీల్‌లో హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

కాశిబుగ్గ: ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి వరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్‌ హెల్ప్‌ డెస్క్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె హెల్ప్‌ డెస్క్‌ పనితీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ గణేశ్‌, వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. వరంగల్‌ కొత్తవాడలో ప్రారంభమైన ఇంటింటి ఎస్‌ఐఆర్‌ సర్వేను కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు. బీఎల్‌ఓను సర్వే విధానం, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్‌ సర్వే విజయవంతం కావడానికి పూర్తిస్థాయిలో ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌, బీఎల్‌ఓలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే, దేశాయిపేటలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement