వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మిడ్ డే మిల్స్ కమిటీ సమావేశంలో పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని ఇంటర్ కళాశాలలకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్‌ను ఆదేశించారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, టీబీసీడీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్‌టేకర్లు, సీఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్‌ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. కొంతమంది సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అసభ్యకర భాష, ప్రవర్తన సహించేది లేదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గణేశ్, డీఈఓ రంగయ్య నాయుడు, డీబీసీడీఓ పుష్పలత, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, సీఎంఓ కట్ల శ్రీనివాస్, జీసీడీఓ ఫ్లో రెన్స్, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రావు ఉన్నారు.
గడువులోగా స్కూల్ పనులు పూర్తి చేయాలి
వరంగల్ చౌరస్తా: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఐఆర్‌ఎస్) పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ మండలం పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ పనులు గురువారం ఆమె పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న సిమెంట్ గ్రేడ్, ఇనుము నాణ్యత, ఇటుకల దృఢత్వం గురించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అ ధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ గణేశ్ డీఈఓ రంగయ్య నాయుడు, తహసీల్దార్ శ్రీకాంత్ ఉన్నారు.


