● ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే లోకోపైలెట్ల క్రూ డిపో కార్యాలయానికి 8 మంది ట్రైన్ మేనేజర్లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ అయినట్లు రైల్వే నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కాజీపేట క్రూ డిపోకు సిబ్బంది బదిలీపై వచ్చారని, ఈ ఏడాది 8 మంది ట్రైన్ మేనేజర్లును కాజీపేటకు బదిలీ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే సంఘ్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్‌కుమార్ తెలిపారు. విజయవాడ వద్ద గల గాలా క్రూ డిపో కార్యాలయం నుంచి 8 మంది ట్రైన్ మేనేజర్లు రెక్వెస్ట్ బదిలీపై త్వరలో కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కృషితో ట్రైన్ మేనేజర్ల బదిలీలు జరుగుతున్నాయని రాజ్‌కుమార్ తెలిపారు.
అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం
● కాశిబుగ్గలోని ఓ హోటల్‌లో ఘటన
● రూ.10వేల జరిమానా విధించిన అధికారులు
కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్‌లో అల్పాహారంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన వినియోదారుడు షాక్‌కు గురయ్యాడు. గురువారం కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లిన ఆ వ్యక్తి వడ తింటున్న సమయంలో బల్లి కళేబరం ముక్కలుగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించిన ఆహార పదార్థాలు, పిండిని పరిశీలించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక హోటల్ నిర్వాహకుడికి రూ.10వేల జరిమానా విధించడంతో పాటు వారం రోజులు టిఫిన్ సెంటర్ మూసివేయాలని ఆదేశించారు.
బాలుడిపై లైంగిక దాడి!
రామన్నపేట: వరంగల్ రామన్నపేట ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడి తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి 6 సంవత్సరాలుగా తన తల్లి ఇంటి వద్ద ఉంటోంది. ఈనెల 18వ తేదీన ఆమె విధులకు వెళ్లగా పిల్లలు పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడిని పొరుగింటికి చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి తలుపులు మూసివేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువైన మహిళ వెతుకుతూ వెళ్లి విషయం గుర్తించి బాలుడి తల్లికి సమాచారం అందించింది. తల్లి అక్కడికి చేరుకోగా తన కుమారుడు దుస్తులు సరిచేసుకుంటుండగా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన కారణంగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు.


