చివరి దశలో భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

చివరి దశలో భూసేకరణ

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

సాక్షి, వరంగల్‌: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అత్యధిక భూములకు పరిహారం చెల్లించిన అధికారులు ప్రస్తుతం గుంటలుగా ఉన్న భూములపై దృష్టి సారించారు. ఈ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేసి పరిహారం చెల్లిస్తే ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూముల్లో ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉన్నాయి. అదనంగా 253 ఎకరాల భూమి అవసరమైంది. ఇందులో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలిన 223 ఎకరాలు ప్రైవేట్‌ వ్యక్తుల పట్టా భూములు. అలాగే 12 కుటుంబాల ఇళ్లకు పరిహారం కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉంది. అయితే ఈ ప్రైవేట్‌ భూముల్లో 216 ఎకరాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. భూ యజమానుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశారు. ఇక కోర్టు వివాదాల్లో ఉన్న 15 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం మొత్తాన్ని జిల్లా కోర్టులో డిపాజిట్‌ చేశారు. న్యాయపరమైన వివాదం తేలిన తర్వాత సంబంధిత భూ యజమానులకు ఆ మొత్తం అందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 330 మంది భూనిర్వాసితుల్లో సుమారు 295 మందికి పరిహారం అందింది. వ్యవసాయ భూమికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887 ధరగా నిర్ణయించిన జిల్లా నెగోషియేషన్‌ కమిటీ నిర్ణయం మేరకు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 203 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి కలిపి రూ.270 కోట్ల వరకు చెల్లించారు. గుంటలుగా ఉన్న మరో ఏడు ఎకరాల భూమిని సర్వే చేసి వారికి వ్యవసాయభూమి ధరకు అనుగుణంగా చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రెండు విడతలుగా రూ.295 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

మామునూరు ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే 216ఎకరాల అప్పగింత

భూనిర్వాసితులకు రూ.270 కోట్ల

చెల్లింపు

దశలవారీగా ఏఏఐకు భూ బదలాయింపు

గుంటల లెక్కన ఉన్న మరో ఏడు ఎకరాల సర్వేకు సన్నాహాలు

నెలరోజుల్లో పూర్తి చేసి కేంద్రానికి

అప్పగించేలా చర్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement