హన్మకొండ: విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు సాధించడం, విద్యుత్ చౌర్యం అరికట్టడం, ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న భారం (ఓవర్‌లోడ్)ను సకాలంలో గుర్తించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా హనుమకొండ మచిలీబజార్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు బిగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మచిలీబజార్ 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 106 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు 224 ఫీడర్లున్నాయి. ప్రతి ఫీడర్‌కు స్మార్ట్‌మీటరు బిగిస్తున్నారు.
డ్యాష్‌బోర్డులో వివరాల నమోదు..
స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ప్రవాహం, వినియోగం, నష్టాలపై రియల్‌టైంలో వివరాలు అందుబాటులోకి వస్తాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వ్యవస్థలో (డ్యాష్‌బోర్డు) ప్రతి అంశం నమోదు అవుతుంది. దీని ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా సరఫరా అయిన విద్యుత్ పరిమాణం, అదేపరిధిలోని వినియోగదారుల మీటర్లలో నమోదైన వినియోగాన్ని పోల్చడం ద్వారా విద్యుత్ చౌర్యం జరిగిన ప్రాంతాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంది. సాధారణ సాంకేతిక నష్టాలను మించి వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకునేందుకు మార్గం సులభమవుతుంది. అధికభారం పడడంతో చాలా ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదం..
స్మార్ట్‌మీటర్లతో ట్రాన్స్‌ఫార్మర్‌పై పడుతున్న లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించవచ్చు. భారం ప్రమాదకర స్థాయికి చేరక ముందే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదా లోడ్ పంపిణీ చేయడం సులభం కానుంది. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే విద్యుత్ చౌర్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పంపిణీ నష్టాలపై కచ్చితమైన అంచనా తెలుసుకోవచ్చు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు నియంత్రించవచ్చు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదపడుతుంది.
వినియోగదారులకు మెరుగైన సేవలు
స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశముంది. మచిలీబజార్ సబ్‌స్టేషన్ పరిధిలో చేపడుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశలవారీగా హనుమకొండ జిల్లా అంతటా, అనంతరం ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి.
– బి.సామ్యానాయక్, హనుమకొండ ఎస్‌ఈ
ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్
విద్యుత్ చౌర్యం, ట్రాన్స్‌ఫార్మర్‌పై
పెరుగుతున్న భారం సులువుగా గుర్తింపు
పైలట్ ప్రాజెక్టుగా మచిలీబజార్
సబ్‌స్టేషన్ పరిధిలో పనులు ముమ్మరం


