పారదర్శక ఓటరు జాబితే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక ఓటరు జాబితే లక్ష్యం

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

పారదర్శక ఓటరు జాబితే లక్ష్యం

ప్రత్యేక సహాయ కేంద్రాలు,

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

హన్మకొండ అర్బన్‌: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌–2026) విజయవంతానికి ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌–2026 అమలు విధానం, ఎన్యుమరేషన్‌ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు బుధవారం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలోని వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో చేపట్టిన ముందస్తు ప్రక్రియకు మంచి స్పందన లభించిందని, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో 68 శాతం, పరకాలలో 87 శాతం మేర మ్యాపింగ్‌ పూర్తయ్యిందని వెల్లడించారు. జూలై 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తారని తెలిపారు. ఇంట్లో లేని ఓటర్లను కనీసం మూడుసార్లు సందర్శించి ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2002 జాబితాలో ఇప్పటికే ఉన్న అర్హులైన ఓటర్లకు ఈ దశలో ఎలాంటి అదనపు పత్రాలు అవసరం లేదని, వివరాలు ధ్రువీకరించి సంతకం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల ను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు కావడం లేదా తప్పుడు వివరాలు సమర్పించడం చట్టవిరుద్ధమని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్‌–31 ప్రకారం డబుల్‌ ఓటు నమోదు నేరమని, అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులతోపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే, 1800 425 1126 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ కె.శ్రీనివాస్‌, డీపీఆర్‌ఓ అయూబ్‌అలీ, ఆర్డీఓ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌–2026

విజయవంతానికి సహకరించాలి

డబుల్‌ ఓట్లపై చర్యలు తప్పవు

హనుమకొండ కలెక్టర్‌

చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement