వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నగరాభివృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రవాణా ఖర్చుల తగ్గింపు, సరుకు రవాణా సామర్థ్య పెంపుకు సిటీ లాజిస్టిక్ ప్లాన్ (సీఎల్పీ) దోహదపడుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సిటీ లాజిస్టిక్ ప్లాన్ (సీఎల్పీ) అమలుపై బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నగర పరిధిలో సరుకు రవాణాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యలు, గిడ్డంగులు, మార్కెట్లు, లాజిస్టిక్ అవసరాలపై సమగ్రంగా చర్చించారు. సీఎల్పీ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, జీఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ (సీఅండ్ ఈపీ) హైదరాబాద్ సుధీన్‌పాల్, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భూ ఆక్రమణలపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు కార్యాలయంలోని భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను విచారించినట్లు తెలిసింది. ల్యాండ్ రికార్డులను సమగ్రంగా సేకరించి మరింత లోతైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అదనపు కలెక్టర్ సంధ్యారాణిని వివరణ కోరగా.. విచారణ ఏమీ లేదని, సాధారణంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించినట్లు స్పష్టం చేశారు.


