గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన, ఉప డ్రైనేజీల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. కొత్తగా కమర్షియల్, గృహ నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయాలని ఆదేశించారు. బల్దియా ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, మహేందర్, మాధవి, సంజయ్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


