ఆధునిక నమూనాలతో నగర పార్కులు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక నమూనాలతో నగర పార్కులు

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

ఆధునిక నమూనాలతో నగర పార్కులు

హనుమకొండ కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌/వరంగల్‌ అర్బన్‌/హసన్‌పర్తి: నగరంలోని పార్కులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆధునిక నమూనాలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ) ప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులతో నగర పార్కుల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ బాలసముద్రంలోని చిల్డ్రన్స్‌ పార్కును డబ్ల్యూఆర్‌ఐ రూపొందించిన ఆధునిక నమూనాల ఆధారంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వరంగల్‌ పరిధి కీర్తినగర్‌ పార్కుతోపాటు ఇతర పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల అవసరాలు, పిల్లల వినోదం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సమావేశంలో డబ్ల్యూఆర్‌ఐ కన్సల్టెంట్‌ ప్రతినిధి ఎలైన్‌ అగీత్‌, జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈలు రవికుమార్‌, సంతోశ్‌బాబు, డీఈ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గోపాల్‌పూర్‌ ఊరచెరువు పరిశీలన..

గోపాల్‌పూర్‌ ఊరచెరువును మంగళవారం హనుమకొండ కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ సందర్శించారు. డీసిల్టేషన్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యత, వేగంపై ఇరిగేషన్‌, డబ్ల్యూఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చెరువు అభివృద్ధి పనులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పనులను వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట జీడబ్ల్యూఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement