వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులను అందజేసి నమోదు ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు. మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదైన సందర్భాల్లో మాత్రమే పేర్ల తొలగింపు చేపడతామని స్పష్టం కలెక్టర్ చేశారు. 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల అవసరాన్ని బట్టి అదనపు బూత్‌లు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని కోరారు. ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించేందుకు మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సందేహాలుంటే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలల్లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీలు సుమ, ఉమారాణి ఉన్నారు.


