గ్రేటర్‌లో చెప్పులరిగేలా తిరిగినా ఫలితం శూన్యం | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో చెప్పులరిగేలా తిరిగినా ఫలితం శూన్యం

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

పెండింగ్‌లో

400

నల్లా కనెక్షన్‌

దరఖాస్తులు

వరంగల్‌ అర్బన్‌: వందలాది మంది నగరవాసులు నల్లా కనెక్షన్‌ కోసం బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆరు నెలలుగా 400కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్పవచ్చు. కాగా డబ్బులిస్తే మాత్రం కొత్త నల్లా కనెక్షన్‌ వారంలోగా వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కొత్త నల్లా కనెక్షన్‌ కోసం ఇంటి నంబరు కలిగి ఉన్న అర్హులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నల్లా కనెక్షన్‌ మంజూరు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. రోడ్డు కట్టింగ్‌, పైపులైన్‌ దూరం తదితర కారణాలతో అధిక రుసుం వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో లైన్‌మెన్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు దరఖాస్తుదారులు అడిగినంత ఇస్తేనే నల్లా కనెక్షన్‌ మంజూరు చేస్తున్నట్లు.. లేదంటే జాప్యం చేస్తూ అనేక కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తుండడంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేరుకే రూ.వంద..

ఖర్చు రూ.10 వేలు!

నల్లా కనెక్షన్‌ దరఖాస్తు చేసుకునే మందు ప్లంబర్‌ను ఆశ్రయిస్తే రూ. 500 ఖర్చవుతోంది. బల్దియాకు దరఖాస్తు చేస్తే రూ.100. తదుపరి విచారణ పేరిట వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మెన్‌ రూ. 2వేల నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. నల్లా కనెక్షన్‌ మంజూరు చేయాలంటే ఏఈ నుంచి ఈఈ వరకు రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోందని పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్‌, కనెక్షన్‌ సామగ్రి తదితర పరికరాల కొనుగోలుతో మరో రూ.3 వేలు ఖర్చవుతోంది.

విచారణ లేదు.. మంజూరూ లేదు..

సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వా రం రోజుల్లోగా క్షేత్రస్థాయిలో విచారించాలి. నిబంధనల మేరకు వారం రోజుల్లో నల్లా కనెక్షన్‌ మంజూ రు చేయాలి. ఆరు నెలల కాలంలో సుమారు 400 కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికా రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం

కొత్త నల్లా కనెక్షన్లు నిబంధనల మేరకు మంజూరు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే మోమోలు జారీ చేస్తాం. అక్రమ కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– రాజ్‌కుమార్‌, బల్దియా ఎస్‌ఈ

3వ డివిజన్‌కు చెందిన రాజేశ్‌ మూడు నెలల క్రితం నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంత వరకు క్షేత్ర స్థాయి విచారణ చేయలేదు. కనెక్షన్‌ ఇవ్వలేదు. నీళ్ల కోసం గోస పడుతున్నాడు.

ఖిలా వరంగల్‌కు చెందిన పబ్బ నరేశ్‌ గత నెల రోజుల క్రితం నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికీ కనెక్షన్‌ ఇవ్వలేదు. కాశిబుగ్గ, బల్దియా కార్యాలయం చూట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం శూన్యం.

డబ్బులిస్తేనే పనవుతోందనే ఆరోపణలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement