సాంకేతిక వినియోగంలో ముందు వరుసలో టీజీ ఎన్పీడీసీఎల్..
హన్మకొండ: భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యలను యుద్ధ ప్రాతి పదికన పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ హైప ర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) డ్రోన్ల ద్వారా సమస్యలను ముందుగా గుర్తించడం ద్వారా అప్రమత్తంగా ఉండేలా ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సర్కిల్‌లో జీపీఆర్‌ఎస్ ఆధారిత ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలను అధికారులు అందుబాటులో ఉంచుకున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాకు జరిగే అంతరాయాన్ని అధిగమించడానికి హైపర్ (హెచ్‌ఏఐపీఆర్) అనే ప్రత్యేక కార్యాచరణతో కూడిన ప్రణాళికను అమలు చేస్తున్నారు.
‘హైపర్’ కార్యాచరణ ప్రణాళిక విశ్లేషణ..
హెచ్ (హెడ్‌క్వార్టర్ అండ్ రెస్పాన్సిబిలిబీ): సిబ్బంది పని చేసే చోట నివాసముంటూ అప్రమత్తంగా ఉండడం.
ఎ (అరేంజ్‌మెంట్ ఆఫ్ మ్యాన్ పవన్ అండ్ మెటీరియల్): అవసరమైన సిబ్బంది. సామగ్రిని ముందస్తుగానే సమకూర్చుకోవడం.
ఐ (ఇన్మర్మేషన్ కలెక్షన్ అండ్ ప్రాంప్ట్ ఇంటిమేషన్): విద్యుత్‌అంతరాయాలపై కచ్చితమైన సమాచార సేకరణ, వేగంగా చేరవేయడం.
పి (ప్లానింగ్ అండ్ మోబిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్): క్షేత్ర స్థాయిలో పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం.
ఇ (ఎక్యుక్యూషన్ ఆప్ వర్క్): నిర్దిష్ఠ కార్యాచరణను వేగంగా అమలు చేయడం.
ఆర్ (రిస్టోరేషన్ ఆఫ్ పవర్ సప్లై): విద్యుత్ సరఫరాను నిర్దేశిత సమయంలో పునరుద్ధరించడం
జీపీఆర్‌ఎస్ ఆధారిత ఎమర్జెన్సీ వాహనాలు..
భారీ వర్షాలతో ఏర్పడే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రతీ సర్కిల్‌లోనూ ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ వాహనాల్లో మరమ్మతులకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి. వీటికి జీపీఆర్‌ఎస్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా సమస్య ఉన్న లొకేషన్‌ను వేగంగా గుర్తించి, సిబ్బంది ఘటనా స్థలికి త్వరగా చేసుకుంటారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో టీజీ ఎన్పీడీసీఎల్ ముందు వరుసలో ఉంది. స్కాడా, జీపీఆర్‌ఎస్, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను కృత్రిమ మేధాతో అనుసంధానం చేశాం. తద్వారా ఫీడర్లలో వచ్చే సమస్యలు 7 నుంచి 21 రోజుల ముందు అంచనా వేయొచ్చు. విద్యుత్ డిమాండ్‌ను ముందే ఊహించి సరఫరాను నియంత్రించొచ్చు. లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. సంస్థలోని ప్రతీ ఉద్యోగి బాధ్యతతో హెడ్ క్వార్టర్లో ఉంటూ, అవసరమైన సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే మా లక్ష్యం.
కర్నాటి వరుణ్ రెడ్డి,
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
భారీ వర్షాలకు ఉత్పన్నమవుతున్న విద్యుత్ సమస్యలు
ఏఐ సాంకేతికత,
డ్రోన్ల ద్వారా ముందస్తు గుర్తింపు
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ


