● రైస్ మిల్లు యజమాని అరెస్ట్
మల్హర్(కాటారం): ప్రభుత్వానికి రూ.4.29 కోట్ల విలువైన బియ్యం చెల్లించని రైస్ మిల్లు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాటా రం సీఐ నాగార్జునరావు కథనం ప్రకారం.. 2022–2023 రబీ, ఖరీఫ్ పంటకు సంబంధించిన సుమారు 38 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పట్టడానికి మండలంలోని దామెరకుంట గ్రామానికి చెందిన 3ఆర్‌ఎస్ రుద్ర రైస్ మిల్లుకు అప్పగించారు. అయితే మిల్లు యజమాని రవికాంత్ బియ్యం అప్పగించ లేదు. దీంతో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ రాఘవేందర్ సుమారు రూ.4.29 కోట్ల విలువైన బియ్యం అప్పగించలేదని రవికాంత్‌పై 2024లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై అభినవ్ కేసు నమోదు చేశారు. కాగా, ఈనెల 15న నిందితుడు రవికాంత్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించినట్లు సీఐ నాగార్జునరావు మంగళవారం తెలిపారు.
స్తంభించిన
‘వాహన్ సారథి’..
● నిలిచిన ఆర్టీఏ సేవలు
ఖిలా వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో వాహన్ సారథి సేవలకు మంగళవారం తీవ్ర ఆటంకం ఏర్పడింది. సర్వర్లు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో సేవలకు అంతరాయం కలిగింది. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావడంతో సోమ, మంగళవారాల్లో సర్వర్లపై ఒత్తిడి పెరిగి స్తంభించినట్లు అధికారులు చెబుతున్నారు. సర్వర్లలో టెక్నికల్ సమస్యలు తలెత్తడం.. వరుసగా రెండో రోజు అదే సమస్య ఉత్పన్నమైంది. దీని వల్ల డ్రైవింగ్ లైసెన్స్‌లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఏ నిమిషం సర్వర్ వస్తుందోనని రోజంతా క్యూలైన్‌లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఆయా నిపుణులు రంగంలో దిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య తలెత్తిందని చెబుతున్నారు. కాగా, సోమ, మంగళవారాల్లో నిలిచిన సేవలన్నీ బుధవారం తిరిగి అదే సమయంలో అందనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
హసన్‌పర్తి: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగారానికి చెందిన రావుల భిక్షపతి(59) నాలుగేళ్ల క్రితం తన సోదరి వివాహానికి వివిధవర్గాల నుంచి సుమారు రూ.8లక్షల మేరకు అప్పు చేశాడు. ఓవైపు అప్పులు పెరిగిపోవడంతో ఆందోళనకు గురై సోమవారం వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. బాధితుడిని వెంటనే ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.


