కమలాపూర్ : రండి.. ఊరి కోసం కలిసికట్టుగా కదులుదామని, ఊరిని పరిశుభ్రంగా చేసుకుందామని, జన్మనిచ్చిన ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానం చేసి గ్రామాన్ని బాగు చేసుకుందామని సర్పంచ్ పబ్బు సతీశ్ పిలుపునిచ్చారు. ఊరి బాగు కోసం, మనందరి ఆరోగ్యం కోసం మీ విలువైన సమయంలో కేవలం ఒక్కరోజును కేటాయించాలని యువకులు, గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య పరిరక్షణ, గ్రామాన్ని స్వచ్ఛ కమలాపూర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఊరి కోసం ఒక్కరోజు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సర్పంచ్‌తో కలిసి చదువుకున్న 1994–95 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, బాల్య మిత్రులతో కలిసి 2వ వార్డులో శ్రమదానం చేసి రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేశారు. సర్పంచ్ సతీశ్ మాట్లాడుతూ.. పెద్ద గ్రామం, తక్కువ పారిశుద్ధ్య సిబ్బంది ఉండటంతో పారిశుద్ధ్య పరిరక్షణ సవాల్‌గా మారిందన్నారు. మురుగు కాల్వల శుభ్రత, చెత్తా చెదారం తొలగింపు, మొక్కల సంరక్షణ ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం ఉంటుందన్నారు. రండి.. తమతో చేతులు కలపండి.. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


