మనస్సు పెడితే మనోహరమే.. | - | Sakshi
Sakshi News home page

మనస్సు పెడితే మనోహరమే..

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

మనస్సు పెడితే మనోహరమే..

ఖిలా వరంగల్‌ : చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలో పర్యాటక అభివృద్ధి పనులు కొనసాగడం లేదు. ప్రభుత్వం మనసు పెడితే మరింత మనోహరంగా కనిపిస్తుందని చరిత్రకారులు భావిస్తున్నారు. రాతికోట చుట్టూ విశాలమైన, లోతైన (నీటికోట) అగర్త చెరువు 60శాతం మేర నేటికి కనిపిస్తోంది. కాకతీయుల రాజధానిలోకి శత్రువులు అడుగు పెట్టేందుకు అవకాశం లేకుండా రక్షణగా అగర్త చెరువులో అప్పట్లో మొసళ్లను పెంచేవారు. నేడు మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధిని పొందుతున్నారు.

నిలిచిన రూ.2కోట్ల అభివృద్ధి పనులు..

రాతికోట పక్కన తాచుపాములా వంపు సొంపులతో సుందరంగా (మోటు) అగర్త చెరువు కనిపిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ సత్యశారద, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీరి ప్రతిపాదనలతో మోటు పునరుజ్జీవనం/స్పాంజ్‌పార్కు కోసం గతేడాది డిసెంబర్‌ 16న ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు కేటాయించి పనులను మంత్రి ప్రారంభించారు. పర్యాటకులకు బోటింగ్‌, చెరువు గట్టుపై సేదదీరేందుకు టేబుల్స్‌, టీ స్టాల్స్‌, విశ్రాంతి గదులు, సాయంత్రం గ్రీనరీలో పర్యాటకులు కోట అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించి మొదటి దఫా రాతికోట ఉత్తర ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.

ఆదిలోనే అడ్డంకులు

శంకుస్థాపన కాగానే అధికారులు పునరుజ్జీవనం కోసం మోటులోని నీటిని తొలగించి, పనులు ప్రారంభించారు. అంతలోనే పలువురు భూ నిర్వాసితులు పరిహారం కోసం పనులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని స్థానికులనుంచి ఒత్తిడి రావడంతో రైతులు నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

మంత్రి దృష్టి సారిస్తే..

మోటును అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరగడంతోపాటు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ దృష్టి సారిస్తే, అధికారులు తక్షణమే స్పందించి భూ నిర్వాసితులతో మాట్లాడితే.. పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

పరిహారం చెల్లిస్తే సహకరిస్తాం..

మోటు పునరుద్ధరణ కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నాం. ప్రభుత్వం నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో అధికారులు చర్చలు జరిపితే ఆభివృద్ధికి సహకరిస్తాం..

– బైరబోయిన శివాజీ, భూ నిర్వాసితుడు

రూ.2కోట్లతో మోటు, గ్రీనరీ,

తదితర పనులకు శంకుస్థాపన

అడ్డుకున్న భూమి కోల్పోతున్న రైతులు

నిలిచిన పునరుద్ధరణ పనులు

పరిహారం చెల్లిస్తే

సహకరిస్తామంటున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement