ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: వరద బాధితులను ఆదుకుంటామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఎన్టీఆర్‌కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్–1, ఫేజ్–2, గంగపుత్ర కాలనీ, డీఆర్‌నగర్, ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఆదివారం కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
నీరు కలుషితం కాకుండా చూడాలి
నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్, ధర్మసాగర్ రిజర్వాయర్లను మేయర్ ఆకస్మికంగా సందర్శించి నీటి సరఫరాను పరిశీలించారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల నీరు రిజర్వాయర్‌లో ప్రవేశించడంతో కొద్దిగా రంగు మారిందని, రెండు రోజుల్లో నీటి రంగు సాధారణ స్థితికి వస్తుందన్నారు. నీరు కలుషితం కాకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ తెలిపారు.
వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలి
వరదతో నష్టపోయిన గృహాలు, కోల్పోయిన వస్తువుల వాస్తవ సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 28వ డివిజన్‌లో మేయర్ పర్యటించి సమాచార నమోదు ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నాలాలపై ఆక్రమణలను తొలగించాలని సంబంధిత విభాగాలకు సూచిస్తానని తెలిపారు. మేయర్ వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్‌ఐ అశోక్ పాల్గొన్నారు.


