వేయిస్తంభాల ఆలయంలో పూజలు
వైభవంగా తులసీధాత్రినారాయణ కల్యాణం
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి ప్రాతఃకాల పూజలు, నిత్యాహ్నికం నిర్వహించారు. రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం శివభక్తులు కరుణాకర్, దీప్తి దంపతుల సౌజన్యంతో శ్రీరుద్రేశ్వరస్వామికి లక్ష శివనామాలు, 21 రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. మహానివేదన జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, ఆదిత్యశర్మ, చెరుకుమల్లి శ్రీవాత్సవాచార్యులు దేవాలయంలో తులసి, ధాత్రినా రాయణ కల్యాణం నిర్వహించారు. వేదికపై ధాత్రినారాయణస్వామి(ఉసిరిక చెట్టు), లక్ష్మీస్వరూపమైన (తులసి చెట్టు)ను ప్రతిష్ఠించారు. కలశస్థాపన, గణపతిపూజ, పుణ్యాహవచనం చేసి లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి, ఉసిరి మొక్కలకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు, లక్ష తులసీదళార్చన చేయనున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు.


