అప్రమత్తతే ఆయుధం
హన్మకొండ : మోంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అలాగే, కోసిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో అధిక వర్షాల నుంచి వివిధ పంటలను ఎలా కాపాడుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ. విజయ భాస్కర్.. రైతులకు పలు సలహాలు, సూచలను ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.
వరి పంట కంకి పాలు పోసుకోవడం నుంచి కోతకు అనువుగా ఉన్న దశలో ఉంది. ఈ నేపథ్యంలో అధిక వర్షాలతో వరిపైరు నేలవాలి నీట మునిగింది. రైతులు వర్షం తగ్గిన తర్వాత పొలం నుంచి కాల్వల ద్వారా నీరు తీసి వాలిపోయిన వరి కొయ్యలను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే, పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంటలో కంకి నల్లి, గింజమచ్చ వచ్చే ఆస్కారం ఉంది. ఈ క్రమంలో నివారణ చర్యలు చేపట్టాలి. 200 మిల్లీ లీటర్ స్పైరోమెసిఫిన్, 200 మిల్లీ లీటరు చొప్పున ప్రోపికోనజోల్ మందులను ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పక్వానికి వచ్చిన వరి కంకులపై గింజ మొలక రాకుండా, కింద రాలిన కంకులు మీద 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
ఆలస్యంగా విత్తుకున్న పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాయకుళ్లు, వడలు తెగుళ్లు ఉన్నాయి. పింజ కూడా తడిసింది. దీని నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు, లీటరు నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. కాయకుళ్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టో సైక్లిన్‌ను పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఏరివేసిన పత్తిని తేమ పీల్చుకోకుండా జాగ్రత్తగా ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరచాలి. తేమ అధికంగా ఉన్నప్పుడు గాలికి ఆరబెట్టాలి.
ప్రస్తుతం కంది పంట శాఖీయ, పూత దశలో ఉంది. ఈ వర్షాలకు ఎండు తెగులు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే, పూత రాలే అవకాశం ఉంది. ముంపునకు గురైన కంది పంటలో ఫైటాఫ్తోర ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగులు గమనించిన వెంటనే వర్షం తగ్గిన తర్వాత రెండు గ్రాముల మెటల్ ఆక్సిల్ మందును లీటరు నీటిలో కలిపి నేల బాగా తడిచేలా మొక్క మొదళ్లలో పిచికారీ చేయాలి.
ప్రస్తుతం మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేసే దశలో ఉంది. ముఖ్యంగా రైతులు వర్షాలకు కంకి, గింజలు గాని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే కంకులను లేదా ఒలిచిన గింజలను గాలికి ఆరబెట్టి నిల్వ చేయాలి.
మిరప శాఖీయ దశలో ఉంది. పంటలో వేరు కుళ్లు తెగులు, పై ఆకు ముడత ప్రధాన సమస్యగా ఉంది. వేరు కుళ్లు తెగుళ్ల నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొదలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పై ఆకు ముడత నివారణకు తెల్ల దోమలను అరికట్టడానికి ఎకరానికి 15 నుంచి 20 పసుపు రంగు జిగురు అట్టలు, అలాగే తామర పురుగుల నుంచి కాపాడుకోవడానికి 20 నుంచి 30 నీలం రంగు జిగురు అట్టలను పొలం మొత్తం అమర్చాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పసుపు పంటలో దుంప కుళ్లు, దుంప పుచ్చు ఆశించే అవకాశం ఉంది. దుంపకుళ్లు నివారణకు మొక్క మొదట్లో వర్షపు నీరు నిల్వ కుండా జాగ్రత్తలు తీసుకుని, మెటల్ ఆక్సిల్, మాన్కోజెబ్ కలిగిన మందును 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. దుంప పుచ్చు ఆశించకుండా ఈగ నివారణకు కార్బొఫ్యూరాన్ 3జి. గుళికలను ఎకరాకు 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కలిపి పొలం మొత్తం చల్లాలి. ఆకు మచ్చ తెగులు అధిక తేమ కలిగిన వాతావరణంలో కనిపిస్తుంది. దీని నివారణకు 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల కలిగిన మందును లీటరు నీటిలో కలిపి ఆకుల పై పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువ ఉంటే ప్రాపికొనజోల్ మిల్లీలీటర్‌ను లీటరు నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. అలాగే పొటాష్ లోపం నివారణకు (13– 0– 45) 5 గ్రాములును లీటరు నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురిసిన వర్షాలను అదునుగా చేసుకుని వర్షాధారిత ఆరుతడి పంటలు మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పెసర, మినుము విత్తుకుని పంటలు సాగు చేసుకోవచ్చని విజయ భాస్కర్ రైతులకు సూచించారు.
వర్షాల నుంచి పంటలను
కాపాడుకోవాలి
వెంటనే తెగుళ్ల నివారణ
చర్యలు చేపట్టాలి
తెలంగాణ విజ్ఞాన కేంద్రం
వరంగల్ కో ఆర్డినేటర్ విజయభాస్కర్
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధం


