
సిమెంట్ పెచ్చులు మీదపడి వ్యక్తికి తీవ్రగాయాలు
కాజీపేట: భవనం పైనుంచి సిమెంట్ పెచ్చులు పడడంతో ఓ బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్న కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కాజీపేట చౌరస్తాలోని త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్‌కు యజమానులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకుండా కొద్ది రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అలీ(59) తమ బంధువుల పిల్లల కోసం బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి సిమెంట్ పెచ్చులు మహమ్మద్ అలీ కాలిపై పడడంతో పూర్తిగా చిధ్రమైంది. దీంతో అలీ కేకలు వేయగా స్పందించిన బాటసారులు 108లో ఎంజీఎం తరలించారు. కాగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేసిన భవన యజమానులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.