
12న పల్స్ పోలియో
ఎంజీఎం: ఈనెల 12వ తేదీన (ఆదివారం) 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సున్న 84,301 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 427 బూత్‌లు, 17 బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మొబైల్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. ఈమేరకు గురువారం జూమ్ ద్వారా వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో ఆయన సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి పలు సూచనలు చేశారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలో పత్తి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో రైతులు 76,463 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారని, సుమారుగా 9,17,556 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానుందని పేర్కొన్నారు. రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు రావాలన్నారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్ గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో ప్రతిభ కనబరుస్తూ సరైన సమయంలో దరఖాస్తుదారులకు సమాచారమిస్తూ చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందున ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గౌరీశంకర్‌కు అవార్డు రావడంపై కలెక్టరేట్ ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు.
వరంగల్ క్రైం: ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పోలీస్ పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సత్కరించారు. ఇటీవల జరిగిన నీట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కుమార్తె తాన్యసభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో, హోంగార్డ్ బాలకిషన్ కుమారుడు ముప్పా చందు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, మరో హోంగార్డ్ మోహన్ కుమార్తె భవాని ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలో సీటు సాధించింది. పిల్లలు ఎంబీబీఎస్‌లో సీటు సాధించడానికి కృషి చేసిన తల్లిదండ్రులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్‌ఐ చంద్రశేఖర్, హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఆస్పత్రిని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్స్‌పల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (పీసీఎండీ) డాక్టర్ నిర్మల, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ నారాయణస్వామి తనిఖీ చేయనున్నట్లు గురువారం రాత్రి రైల్వే నాయకులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటారని, రైల్వే ఆస్పత్రి డెవలప్‌మెంట్, పేషెంట్ల సమస్యలు అడిగి తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.

12న పల్స్ పోలియో