
అరైస్ సిటీకి అనుగుణంగా చర్యలు
ఢిల్లీ సదస్సులో మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అరైస్ సిటీకి అనుగుణంగా వరంగల్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఇక్లీ సౌత్ ఏసియా సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్నందున, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎన్‌ఐయూఏ) సంయుక్తంగా అరైస్ సిటీస్‌పై సదస్సు నిర్వహించారు. బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాల నుంచి 200 మంది డెలిగేట్స్ వేదికపై హాజరవ్వగా.. ఇందులో మేయర్ మాట్లాడుతూ.. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, హుజూరాబాద్ వద్ద రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని విశ్లేషించి అందుకు తగినట్లుగా అడాప్టివ్ మెజర్స్, స్ట్రక్చరల్ మెజర్స్, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్‌గా విభజించినట్లు తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామని, ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. పదిశాతం గ్రీన్ బడ్జెట్‌తో పచ్చదనం కోసం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు.
● అంతమందిని ఎందుకు తీసుకెళ్లారని బోర్డు చైర్మన్ అసహనం
● బిల్లు సర్దుబాటుపై అధికారుల మల్లగుల్లాలు
వరంగల్ అర్బన్: స్టడీ టూర్ గ్రాంట్ సర్దుబాటు సమస్మాత్మకంగా మారింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా స్టడీ టూర్ కోసం రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. కౌన్సిల్ తీర్మానం చేసి, ఈ నిధులతో గత నెల కార్పొరేటర్ల బృందం స్టడీ టూర్‌కు వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. 55 మంది కార్పొరేటర్లతోపాటు బల్దియాకు చెందిన 8 మంది అధికారులు, 17 మంది ఉద్యోగులు అధ్యయన యాత్రకు వెళ్లడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, ఇప్పుడు ఈ బిల్లు సర్దుబాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 7న స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూఎస్‌సీసీఎల్) చైర్మన్ డా.టికే శ్రీదేవి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈ స్మార్ట్‌సిటీ టూర్ బిల్లు సర్దుబాటుపై చైర్మన్ దృష్టికి మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తీసుకెళ్లారు. కార్పొరేటర్లతో పాటు ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను ఎలా? తీసుకెళ్తారంటూ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు టూర్‌కు వెళ్లడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటనే సందేహాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరి రవాణా, బస ఖర్చులు చూపడం సరికాదని సూచించారు. దీంతో పాలక వర్గం పెద్దలు, ఉన్నతాధికారులు నివ్వెరపోయారు. స్మార్ట్‌సిటీ గ్రాంటులో ఉద్యోగుల ఖర్చుల వివరాలను నమోదు చేస్తే ఆడిట్‌లో అభ్యంతరం వ్యక్తం కానుంది. ఈఖర్చును ఎలా చూపించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. జనరల్ ఫండ్ లేక ఇతర నిధులను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో 6 నెలల పాలక వర్గం గడువు ముగుస్తున్న క్రమంలో టూర్‌కు వెళ్లడం.. పైగా, ఉద్యోగులను అధిక సంఖ్యలో తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.