
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్:
కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్‌మిల్లర్లకు కాసులు కురిపించే కల్ప తరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యాన్ని దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.
మూడేళ్లుగా తాత్సారం..
రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్‌మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా.. అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్‌కు చెందిన 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
వివాదమైనప్పుడే స్పందన..
కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు.. రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్ల ర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
మూడేళ్ల కిందట
ఇచ్చిన ధాన్యంలో
కొందరు సుమారు
రూ.236 కోట్ల విలువైన
ధాన్యాన్ని మింగేశారు. వారినుంచి డబ్బులు రాబట్టుకునేందుకు
తీసుకున్న చర్యలు లేవు.
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా
మూడేళ్లయినా పట్టించుకోని
యంత్రాంగం
సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం
మిల్లర్లు, అధికారులకు
పప్పుబెల్లంలా సీఎంఆర్
రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు
1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం
విచారణలో తేల్చిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్’

గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025