
స్థానిక ఎన్నికల సంరంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్:
స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం నేటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసి పటిష్ట ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
జిల్లాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు..
మెదటి విడత ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగన్నాయి. భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట జెడ్పీటీసీలు, ఆ మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనగామలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘన్‌పూర్, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు జెడ్పీటీసీలు... 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీ స్థానాలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు, 30 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి.
నేడు ఎన్నికల నోటిఫికేషన్
నామినేషన్ల స్వీకరణకు
అధికారుల ఏర్పాట్లు
ఉమ్మడి వరంగల్ లో మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు