
ట్రాఫిక్ నియంత్రణకు కలిసి పనిచేద్దాం
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో రోజురోజూకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను అధిగమించేందుకు బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సీపీ సన్‌ప్రీత్ సింగ్ ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్ల ఆక్రమణలు, ప్రధాన మార్గంలో వాహనదారులకు ప్రమాదకంగా మారిన గుంతల మరమ్మతులు చేపట్టాలన్నారు. వడ్డేపల్లి, కాళోజీ సెంటర్, తెలంగాణ జంక్షన్, మడికొండ చౌరస్తా, మరో రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన రోడ్లపై వ్యాపార సైన్ బోర్డుల తొలగింపుతోపాటు వ్యాపార సముదాయాల్లోని సెల్లారుల్లోనే వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రోడ్లపై వినియోగంలో లేని కరెంట్, టెలిఫోన్ స్తంభాల తొలగించడం, వర్షాకాలంలో వరద రోడ్లపై నిలిచి వాహన రాక పోకలకు ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో ఆ నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు గుంతలు పడిన ప్రాంతాలతోపాటు డివైడర్ల ఎత్తున పెంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాఫిక్ అధికారులు అందజేయాలన్నారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బాణసంచా విక్రయ కేంద్రాల అనుమతికి దరఖాస్తులు
దీపావళి సందర్భంగా కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయాలతోపాటు బాణసంచా నిల్వ చేసుకొనేందుకు అనుమతి కోసం ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈనెల 16వ తేదీలోపు సంబంధిత జోన్లకు చెందిన డీసీపీ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. దరఖాస్తు ఫామ్‌తో తప్పనిసరిగా అగ్నిమాపక అధికారులు జారీచేసిన ఎన్‌ఓసీతోపాటు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేస్తే అధికారులు, యజమానుల అనుమతి పత్రాలు తీసుకోవాలన్నారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అదాలత్ శాఖలో రూ.800 బ్యాంకు చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్