
అక్కడ తప్పించుకున్నారు.. ఇక్కడ పట్టుబడ్డారు
హసన్‌పర్తి: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో తప్పించుకున్న గంజాయి విక్రయదారులు హనుమకొండలో పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు రూ.20.50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోచ్‌బెహార్‌కు చెందిన రాణాహుస్సేన్ వృత్తిరీత్యా పెయింటర్. సులువుగా డబ్బులు సంపాదించేందుకు తన గ్రామంలో ఉంటున్న గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర బర్మన్‌ను ఆయన సంప్రదించాడు. నాలుగు నెలల క్రితం తన వద్ద ఉన్న డబ్బులతో గంజాయిని ఖరీదు చేసి రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాడు. సరుకుని ఇక్కడ విక్రయించినట్లు ఏసీపీ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. ఈవిషయాన్ని తన చిన్న నాటి స్నేహితుడు నూర్ మహ్మద్ మియాకు వివరించాడు. దీంతో నాలుగు రోజుల క్రితం ఇద్దరు చేరో లక్ష రూపాయల చొప్పున సమకూర్చుకున్నారు. గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర నుంచి సుమారు 41 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఈనెల 4న రైలులో పశ్చిమబెంగాల్ నుంచి సికింద్రాబాద్‌కు పయనమయ్యారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీల నుంచి వారు తప్పించుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హనుమకొండ బస్టాండ్, తర్వాత ముచ్చర్ల క్రాస్‌లోని జాతీయ రహదారికి చేరుకున్నారు. లారీ ఎక్కి సికింద్రాబాద్‌కు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు ఏసీపీ నర్సింహారావు చెప్పారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రూ.20.50 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి విక్రయదారులను పట్టుకోవడంతో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్పై కల్యాణ్‌కుమార్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
రూ.20.50 లక్షల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ నర్సింహారావు