
ఎన్నిసార్లుఫిర్యాదు చేయాలి?
వరంగల్ అర్బన్: ‘మౌలిక వసతులు కల్పించరా? ఆక్రమణలు, అతిక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ పలు కాలనీలవాసులు బల్దియా గ్రీవెన్స్‌లో అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ దరఖాస్తులు స్వీకరించి, అభివృద్ధి పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు అందజేయాలని, ఇతర సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేయాలని ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. గ్రీవెన్స్ సెల్‌కు 61 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్‌కు 29, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 18, హెల్త్– శానిటేషన్ 7, పన్నుల విభాగానికి 6, తాగునీటి సరఫరాకు 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, సీహెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.