
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.