
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
సాంబశివరావు
ఎంజీఎం: తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డలు మానసికంగా అభివృద్ధి చెందడతోపాటు ఎదుగుదలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బరువు తగ్గుతారని, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుందని, క్యాన్సర్లు రాకుండా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే హక్కును పొందేటట్లు చూడాలని సూచించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ డాక్టర్ మురళి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.