జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి
గుంటూరు లీగల్: భారత రాజ్యాంగం అత్యంత విలువలు, విశిష్టత కలిగినదని, దాని గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి మౌలిక విలువలను అందించిందని తెలిపారు. సీనియర్ న్యాయవాది మద్దు అంకయ్య డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌పై రచించిన పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆవిష్కరించారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు జి.శాంతకుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, సీనియర్ న్యాయవాదులు జూపూడి రంగరాజు, అంకమ్మ చౌదరి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రేవతి. జనరల్ సెక్రెటరీ వీర మనేంద్ర సిద్దా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కొల్లిపర: మండల పరిధిలోని చివలూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పంటలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గురువారం పరిశీలించారు. కోతకు వచ్చిన పంటల పరిస్థితి, వాటిని యంత్రాలు ద్వారా నూర్పిడి చేసే విధానం తదితర అంశాలను స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు పరిస్థితులను, కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ప్రతి గ్రామంలో వరి కోతలు పూర్తయ్యే వరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, డీసీఎంఎస్ అధికారి రవీంద్రబాబు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను శుక్ర, శనివారాలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (అటానమస్) క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్, టోర్నమెంట్ చైర్మన్ కపలవాయి రాజేంద్రప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజామెర్సిన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను నాకౌట్ కం లీగ్ విధానంలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. వర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాల జట్టును పోటీకి పంపాలని కోరారు. కళాశాల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం జరగనున్న బహుమతి ప్రదానోత్సవంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కంచర్ల గంగాధరరావు పాల్గొంటారని తెలిపారు.


