ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునాది | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునాది

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేష్‌ ● ఏఎన్‌యూలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం

ఏఎన్‌యూ(పెదకాకాని): రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ విభాగం ఆధ్వర్యాన 77వ రాజ్యాంగ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య కె గంగాధరరావు అధ్యక్షత వహించారు. జస్టిస్‌ రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరు కాగా వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ శివరామ్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి సింహాచలం గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. జస్టిస్‌ రమేష్‌ మాట్లాడుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణలో న్యాయవ్యవస్థ, న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతోపాటు పౌరుల బాధ్యతలను గుర్తించడం కూడా ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ కె గంగాధరరావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం ప్రతి పౌరుడి జీవితంలో కీలకమైనవన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, రేఖాపటాల చిత్రీకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, కామర్స్‌ అండ్‌ లా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం త్రిమూర్తిరావు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయశాస్త్ర అధ్యయన విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌ విజయలక్ష్మి నిర్వహించారు. విశ్వవిద్యాలయ అధికారులు, న్యాయ ప్రముఖులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

మన రాజ్యాంగం ఎంతో ప్రత్యేకం

గుంటూరు వెస్ట్‌: దేశ చరిత్రలో రాజ్యాంగ దినోత్సవానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ డా. బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజ్యాంగం దేశ పౌరులకు అనేక హక్కులను కల్పించడంతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశించిందన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నాలుగు ప్రధాన విలువలు భారత రాజ్యాంగానికి పునాదులన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి పౌరుడికి సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మల్లేశ్వరి, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల విషయంలో విలువలు పాటించాలి

ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల విషయంలో రాజ్యాంగ విలువలను పాటించాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన ప్రదర్శనలో ఏపీజీఈఏ జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించేలా చట్టం చేయాలని 19 జనవరి 2023న రాష్ట్ర గవర్నర్‌కు చేసిన అభ్యర్థనకు కట్టుబడి ఉంటామన్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement