తెనాలి: హెచ్‌ఐవీ నియంత్రణలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) గ్రేడింగ్‌లో గుంటూరు
జిల్లా ‘సురక్షిత్’ కేటగిరీలో నమోదైంది. ‘నాకో’ నిర్దేశించిన మూడు కేటగిరీల్లో 95–95–95 లక్ష్యాన్ని 95 శాతంపైగా సాధించటం ద్వారా ఈ గ్రేడింగ్‌ను చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 28 జిల్లాలకు ఈ మూడు లక్ష్యాల్లోనూ ఎక్కువ ప్రగతిని సాధించిన పది జిల్లాల్లో గుంటూరు ఒకటిగా నిలిచింది. ఈ పనితీరుపై గ్రేడింగులు తాజాగా విడుదల చేశారు. ఏటా డిసెంబరు ఒకటిని నిర్వహిస్తున్న ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పంచాయతీ ఎన్నికల కోడ్ కారణండా 9న జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించేందుకు ‘నాకో’ మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించింది. మొదటిది హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ వ్యాధి గురించి తెలియజేయడం మొదటిది కాగా, రెండోది వారిలో 95 శాతం మందికి ఏఆర్‌టీ చికిత్స అందించడం, మూడోది చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్ లోడ్‌ను నియంత్రణలోకి తీసుకురావడం. ఏ
ఏకకాలంలో ఇలా...
ఈ లక్ష్యాల సాధన ఆధారంగా జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. మూడు లక్ష్యాల్లోనూ
95 శాతానికి పైగా ప్రగతి సాధించిన పది జిల్లాలు ‘సురక్షిత్’ కేటగిరిలో స్థానం పొందాయి. వీటిలో
గుంటూరు జిల్లా ఒకటి. కేవలం రెండు లక్ష్యాల్లో మాత్రమే 95 శాతం ప్రగతిని అందుకున్న తొమ్మిది జిల్లాలను ‘సంక్షమ్’ కేటగిరీలోనూ, కేవలం ఒకే ఒక లక్ష్యంలో ప్రగతిని సాధించిన మరో తొమ్మిది జిల్లాలను ‘సంఘర్ష్‌శీల్’ కేటగిరీలో ఉంచారు.
ఏటా ఒక శాతానికి పైగా పెరుగుదల...
హెచ్‌ఐవీ కౌన్సెలింగ్, పరీక్షల సేవల గణాంకాలను పరిశీలిస్తే గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా పాజిటివిటీ 1.05 శాతం, 1.23 శాతం, 1.06 శాతంగా నమోదైంది. అంటే భారీ పెరుగుదల లేకున్నా సగటున ఒక శాతం పైగానే కేసులు వస్తున్నాయని అర్థమవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో 92 శాతం పాజిటివిటీ రావటం గమనించాల్సిన అంశం. హెచ్‌ఐవీ బాధితులను ముందుగానే గుర్తించడం, వారికి నిరంతరం ఏఆర్‌టీ చికిత్స అందించటం, చికిత్సకు దూరమైన వారిని తిరిగి వైద్యసేవల్లోకి తీసుకురావటం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘నాకో’ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటంతో పరీక్షలు, చికిత్స, వైరల్ లోడ్ నియంత్రణ కీలకపాత్ర పోషిస్తున్నాయి.
జిల్లాలో 16,012 మంది బాధితులు...
‘నాకో’ విడుదల చేసిన ‘ఇండియా హెచ్‌ఐవీ ఎస్టిమేషన్–2025’ సాంకేతిక నివేదిక ప్రకారం గుంటూరు జిల్లాలో దాదాపు 16,012 మంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. 2026 మే నాటికి 15,058 మందిని గుర్తించినట్టు నివేదికలో తెలిపారు. జిల్లాలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి, ఐడీహెచ్ ఫీవర్ ఆసుపత్రి, ఎన్నారై మెడికల్ కాలేజీ, కాటూరి మెడికల్ కాలేజీల్లో ఏఆర్‌టీ చికిత్స సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం 2026 మే నాటికి ఈ ఐదు కేంద్రాల్లో కలిపి 18,700 మంది హెచ్‌ఐవీ బాధితులు ఏఆర్‌టీ చికిత్స సేవలు పొందుతున్నారు. వీరిలో 7,791 మంది పురుషులు, 10,304 మంది మహిళలు, 58 మంది ట్రాన్స్ జెండర్లు కాగా, 290 మంది బాలురు, 257 మంది బాలికలు ఉన్నారు. ఇదే సమయంలో మొత్తం 1,377 మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. అలాగే 2,634 మంది హెచ్‌ఐవీ బాధితులు ప్రస్తుతం ఏఆర్‌టీ పెన్షన్లు అందుకుంటున్నారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్‌టీ కేంద్రంలో 2026 మే నాటికి మొత్తం 6,301 మంది హెచ్‌ఐవీ బాధితులు చికిత్స సేవలు తీసుకుంటున్నారు. వీరిలో 2,654 మంది పురుషులు, 3,453 మంది మహిళలు. మరో 21 మంది ట్రాన్స్‌జెండర్లు, 97 మంది బాలురు, 76 మంది బాలికలు ఉన్నారు. ఈ కేంద్రం పరిధిలో 378 మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. మొత్తం 644 మంది హెచ్‌ఐవీ బాధితులు ప్రస్తుం ఏఆర్‌టీ పెన్షను తీసుకుంటున్నారు.


