మంగళగిరి టౌన్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) కార్పొరేషన్ ఎన్నికలు–2026 గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 2,37,712 మంది ఓటర్లకు గాను 1,77,449 మంది ఓటు వేయడంతో 74.65 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.
పోలీసుల పటిష్ట నిఘా
నగరపాలక సంస్థ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు.
స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సులను సేకరించి పటిష్ట పోలీసు భద్రత మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు, భద్రపరిచే ప్రక్రియను ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజాతీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న
1,77,449 మంది
62 డివిజన్లలో 261 పోలింగ్
కేంద్రాలు..
పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్
రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు


