తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన రాసాపుత్ర రాంబాబు సింగ్(60) ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నాడు. బుధవారం తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల్లూరులో ఉన్న మృతుడి బంధువులు గురువారం వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృత్యువాత
నగరంపాలెం: ఎస్సీ, ఎస్టీ సెల్‌లో అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్న వట్టిచెరుకురు పీఎస్ కానిస్టేబుల్ పచ్చి పాల హరికృష్ణ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన మృతిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రూ.లక్ష నగదును మృతుని భార్య శిరీషకు పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం.లక్ష్మయ్య, ఈసీ సభ్యులు కరిముల్లా, ఎస్సీ, ఎస్టీ సెల్ ఏఎస్‌ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ముప్పాళ్ళ: మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలోని వ్యవసాయ నేలబావిలో యువకుడి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన... బొల్లవరం–దమ్మాలపాడు గ్రామాల మద్య కొల్లా కోటేశ్వరరావుకు చెందిన వ్యవసాయ భూమిలో నేలబావి ఉంది. అందులో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారితోపాటు రెవెన్యూ సిబ్బంది మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. మృతుడు సత్తెనపల్లి వెంకటపతి కాలనీకి చెందిన జొన్నలగడ్డ కోటమరాజు(24)గా గుర్తించారు. సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బీరు సీసాతో హత్యాయత్నం
తెనాలిరూరల్: తన తమ్ముడిపై ఎందుకు దాడి చేస్తున్నావని అడిగినందుకు అన్నపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదైంది. మండల పరిధిలోని అంగలకుదురుకు చెందిన రత్తయ్యపై మూకర రామకృష్ణ ఈ నెల 16వ తేదీన దాడికి దిగాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న రత్తయ్య సోదరుడు సుబ్బారావు దీనిపై ప్రశ్నించారు. దీంతో బీరు సీసా పగలగొట్టిన రామకృష్ణ... సుబ్బారావుపైనా దాడి చేశాడు. వీపు భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స కోసం వైద్యశాలలో చేరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.


