వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అంబటి సూచన పార్టీ శ్రేణులను పోలీసులతో బెదిరించాలని కూటమి కుట్రలు ఎన్ఓసీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదని మండిపాటు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన మాజీ మంత్రి అంబటి, నేతలు
బెదిరింపులు సరికాదు
నగరంపాలెం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయాలనే కుట్రలు, కుతంత్రాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా రౌడీషీట్లు తెరవడం, బైండోవర్లు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై గతంలో ఎటువంటి కేసులు లేకపోయినా, కూటమి నాయకులు పోలీసులతో ఫోన్‌కాల్స్ చేయిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. సంతకాలు చేయాలంటూ పోలీస్స్టేషన్లకు రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
నోటీసులు ఇస్తేనే...
అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లకు కూటమి నాయకులు పోలీసులతో ఫోన్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. రౌడీషీట్లు తెరుస్తామని, బైండోవర్లు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరినైనా బైండోవర్ చేయాలన్నా, రౌడీషీట్ తెరవాలన్నా ముందుగా నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కేవలం కూటమి పెద్దలు పోలీసులతో ఫోన్ చేయించి వేధించడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల ముందు తమ పార్టీ క్యాడర్‌ను పోలీసుల ద్వారా భయపెట్టించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయవద్దని సూచించారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎవరినైనా బైండోవర్ చేసేటప్పుడు నోటీసులు ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్, జెడ్పీ చైర్పర్సన్ పదవులకు అభ్యర్థులను త్వరలో నిర్ణయిస్తామన్నారు. పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఇటీవల ఎక్కువ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి వస్తున్నారని అన్నారు. మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ల పరిధిలోని ఇలా పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానంగా మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు.
ధ్రువపత్రాలేవీ?
జిల్లాలో పోలీసులు, అధికారులు ఎన్ఓసీలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకుండా, పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తద్వారా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా గెలవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అయితే, దీనిని ఎదుర్కొనేందుకు న్యాయపరంగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల పరంగా కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తే, గుంటూరు లీగల్ సెల్ సిటీ అధ్యక్షుడు కె. రామకృష్ణారెడ్డి(98483 61788), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకట్ వేణు (99491 40978), గుంటూరు తూర్పు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు షేక్ షమ్మీ (63004 14434), ప్రత్తిపాడు లీగల్ సెల్ అధ్యక్షుడు జి.వి.సుబ్బారావు (97054 51397) లను సంప్రదించాలని సూచించారు. నోటీసులు ఇవ్వకుంటే ఎవరూ పోలీస్స్టేషన్లకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. క్యాడర్ ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ, రౌడీషీట్లు తెరుస్తామని, బైండోవర్ కేసులు నమోదు చేస్తామని పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల మాన్యువల్ చదివి చర్యలు తీసుకోవాలని, మాట్లాడితే రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం సరికాదని హితవు పలికారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారని చెప్పారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. కేవలం భయపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆరోపించారు. ఎటువంటి కేసులు లేకపోయినా పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లి రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన స్వేచ్ఛను వైఎస్సార్సీపీలోని అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, బెదిరించినా తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై ఎక్కువగా రౌడీషీట్లు నమోదు చేస్తున్నారని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 76 డివిజన్లలో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేసుల నమోదు పెరిగిపోయిందని ఆరోపించారు. తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మల రాజనారాయణ, రసూల్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు.


