గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోగిన ఎన్నికల నగారా
జీఎంసీ, తెనాలి, చీరాల, రేపల్లెల్లో తొలి విడత పోరు
ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు
నామినేషన్లకు 3 రోజులే గడువు ఉండటంతో ఆశావహుల్లో టెన్షన్
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బూత్లు ఇలా..
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పురపాలక ఎన్నికల సమరానికి తెరలేచింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల ఎన్నికల నగారా మోగడంతో అధికార యంత్రాంగం సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులు/కలెక్టర్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
తొలి విడత ఇక్కడ...
మొదటి విడత పురపోరులో గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)లోని మొత్తం 76 డివిజన్లకు, అలాగే తెనాలి మున్సిపాలిటీలోని 52 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీలకు ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్ల మున్సిపాలిటీని మినహాయించగా.. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డులకు, రేపల్లె మున్సిపాలిటీలోని 36 వార్డులకు తొలి విడతలోనే ఎన్నికల సమరం జరగనుంది.
నామినేషన్లకు మూడు రోజులే గడువు
ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజులే (ఈ నెల 16, 17, 18వ తేదీలు) సమయం కేటాయించడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చోపచర్చలు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక, బీ–ఫారాల కేటాయింపుపై పార్టీల ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. టికెట్లు ఆశిస్తున్న వారు సైతం సమయం చాలా తక్కువగా ఉండటంతో సర్టిఫికెట్ల సేకరణ, ఏర్పాట్లపై తీవ్ర ఉత్కంఠ, హైరానాకు గురవుతున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలపై అభ్యంతరాల ప్రక్రియ ముగిసి తుది జాబితాలు సిద్ధమయ్యాయి. రిజర్వేషన్లు సైతం ఇప్పటికే ఖరారు కావడంతో రెండు జిల్లాల పరిధిలోని పురపాలక క్షేత్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
అతి సమస్యాత్మక
19 ప్రాంతాల్లోని 80 కేంద్రాలు
సమస్యాత్మక
41 ప్రాంతాల్లోని 158 కేంద్రాలు
సాధారణం
137 ప్రాంతాల్లోని 358 కేంద్రాలు


