గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, స్థానిక సంస్థల అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ తగిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థకు, తెనాలి పురపాలక సంస్థకు జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. అక్టోబర్ 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని చెప్పారు. నామినేషన్లను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారన్నారు. అక్టోబర్ 18 వ తేదీన నామినేషన్ల దాఖలు చేసేందుకు చివరి తేదీ అని తెలిపారు. 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 21న అభ్యర్థిత్వం ఉపసంహరణకు ఆఖరు తేదీ అని వివరించారు. 21వ తేదీన పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన చేస్తారని చెప్పారు. 28వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ వివరించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 3న పోలింగ్
కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నోటిఫికేషన్ విడుదల అనంతరం నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరుగుతుందని, ఐదో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశలలో జరుగుతుందని, డిసెంబర్ రెండవ తేదీ నాటికి చివరి దశ పూర్తి అవుతుందని వివరించారు. జిల్లాలో మొత్తం 207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. గురువారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


