నెహ్రూనగర్: ఎన్నికల ప్రక్రియలో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారం అధికార పార్టీ నేతలకు క్షణాల్లో చేరిపోతోంది. రాజ్యాంగబద్ధంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కొందరు అధికారులు అధికార టీడీపీ నేతలకు తొత్తులుగా మారి స్వామిభక్తి చాటుకుంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల రిజర్వేషన్ల ఖరారు మొదలుకొని ఎన్నికల విధుల్లో అధికారుల నియామకం వరకు అంతా ‘పచ్చ’మయంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడక ముందే కలెక్టర్ సంతకంతో కూడిన కాపీలు పచ్చనేతల వాట్సాప్లలో ప్రత్యక్షమవడం నగరంలో తీవ్ర దుమారం రేపుతోంది.
అర్ధరాత్రి వరకు డ్రామా.. ముందే లీకు
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రానికే పూర్తయి వెల్లడైంది. అయితే, గుంటూరు కార్పొరేషన్కు సంబంధించి మాత్రం అర్ధరాత్రి 11 గంటల వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా తొక్కిపెట్టారు. తీరా చూస్తే.. కలెక్టర్ సంతకం చేసిన అసలైన రిజర్వేషన్ ప్రియాంబుల్ కాపీ గంటల ముందే టీడీపీ ముఖ్య నేతలు, వారికి అనుకూలమైన మీడియా ప్రతినిధుల వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారమంతా చూసి ప్రతిపక్ష పార్టీలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
తప్పు కప్పిపుచ్చుకునేందుకు
కలెక్టర్ సంతకంతో కూడిన రహస్య పత్రం ముందే బయటకు వచ్చిందన్న విషయం రచ్చకెక్కడంతో జీఎంసీ అధికారులు కొత్త డ్రామాకు తెరతీశారు. తమ లీకేజీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. కలెక్టర్ సంతకం లేని కేవలం వార్డుల జాబితాను మాత్రమే జీఎంసీ అధికారిక మీడియా గ్రూపుల్లో షేర్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లీకై న కాపీలోని అంశాలు, జీఎంసీ విడుదల చేసిన వివరాలు అక్షరం పొల్లుపోకుండా ఒక్కటే కావడంతో అధికారులు అధికార పార్టీకి ఏ స్థాయిలో లొంగిపోయారో బట్టబయలైంది.
అనుకూల అధికారుల ఎంపిక
ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో అడ్డదారిలోనైనా కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గాలని టీడీపీ కుతంత్రాలకు తెరలేపింది. ఇందుకు జీఎంసీలోని కొందరు కీలక అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న వార్డుల్లో ఓట్లను తొలగించడం, పక్క వార్డుల్లోకి మార్చడం ద్వారా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో కీలకపాత్ర పోషించే రిటర్నింగ్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల నియామకంలోనూ... టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు అనుకూలంగా వ్యవహరించే వారినే ఏరి కోరి మరీ జీఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి విధుల్లో కూర్చోబెట్టారనే ఆరోపణలు నగరపాలక సంస్థ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారుల తీరుపై నగర ప్రజలతోపాటు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు సజావుగా, నిష్పాక్షికంగా జరగాలంటే ఈ లీకేజీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


