గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్న్కు చెందిన న్యాయవాదులు మహమ్మద్ మాజ్ షేక్, ఆలపాటి ఆకాష్, యడ్లపల్లి సాయిరామ్, చెవుల సచిన్లు రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికై నట్లు ఇండియన్ అడ్వకేట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు నరాల రమణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో జరిగే ఈ జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు చెందిన న్యాయవాదుల జట్లు పాల్గొననున్నాయి. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల క్రికెట్ జట్టుకు మహమ్మద్ మాజ్ షేక్ను కెప్టెన్న్గా నియమించినట్లు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ జట్టు పోటీల్లో పాల్గొననుంది. జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి నలుగురు న్యాయవాదులు ఎంపిక కావడం గర్వకారణమని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు గుంటూరు బార్ అసోసియేషన్ కార్యవర్గం అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది శాతరాసి ఏడుకొండలు వారికి ఆర్థిక సహాయంతో పాటు క్రికెట్ కిట్టును అందజేశారు.
చేబ్రోలు: చేబ్రోలు మండలం వేజండ్లలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంటలను ఢిల్లీకి చెందిన సీఈఈడబ్ల్యూ(కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ వాటర్) బృందం బుధవారం పరిశీలించింది. మండల పరిధిలోని వేజండ్ల గ్రామానికి చెందిన మహిళా రైతు వేజండ్ల రాణి ఆరేళ్ల నుంచి నిర్వహిస్తున్న పీఎండీఎస్ క్షేత్రంతో పాటు, ఈ ఏడాది చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రం, రసాయన వ్యవసాయ క్షేత్రాన్ని బృందం సందర్శించింది. పంటల పెరుగుదల, మొక్కల దుబ్బులు, పంట ఆరోగ్యం తదితర అంశాలను పరిశీలించింది. పశుగ్రాసం కోసం పీఎండీఎస్ను వినియోగిస్తున్న రైతులతో బృందం సభ్యులు మాట్లాడారు. వరి, మిరప, కూరగాయలు సాగు చేస్తున్న రైతుల నుంచి సాగుకు ముందు, తర్వాత వచ్చిన మార్పులు, అనుభవాలు, భవిష్యత్లో ఈ విధానాన్ని కొనసాగించే ఆలోచనలపై వివరాలు సేకరించింది. మహిళా సంఘాల సభ్యులతోనూ చర్చించి, పోషకాహార కిట్ల తయారీ, ఉత్పత్తుల నిర్వహణ, ఆదాయం, ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను వాటిని నమోదు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, రైతుల అనుభవాల ద్వారా పీఎండీఎస్ సాగు విధానంపై అధ్యయనం చేసింది. ఎం.ఖన్నా, పి.బంజా, అడిషనల్ డీపీఎం సత్యనారాయణ, వైపీ రవితేజ, వీరలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్: విజయవాడకు చెందిన మటన్ వ్యాపారి షేక్ మస్తాన్ వలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళగిరి మండల పరిధిలోని కాజా టోల్గేట్ సమీపంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడలో మటన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న షేక్ మస్తాన్వలికి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఫంక్షన్న్కు పెద్ద మొత్తంలో మటన్ ఆర్డర్ రావడంతో తన మారుతి సుజుకి సూపర్ క్యారీ కారులో మటన్ డెలివరీ చేసి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హైవే పై హ్యాపీ నేస్ట్ వద్ద ఎటువంటి హెచ్చరికలు, భద్రతా చర్యలు లేకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ మస్తాన్ వలి అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ షేక్ నూరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు అబ్దుల్ బాజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


