గుంటూరు మెడికల్: మేకల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తూ నీట్ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీ బీఎస్ సీటు సాధించిన గుడెలీ ఝాన్సీకి గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, బీపీ మండల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేటకు చెందిన గుడెలీ మల్లయ్య, సువర్ణ దంపతుల కుమార్తె ఝాన్సీ మెడికల్ కాలేజీలో సీటు సాధించినట్లు ‘సాక్షి’ చానల్‌లో మేకల కాపరి... మెడికల్ విద్యార్థిని శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు విద్యార్థిని ఝాన్సీ చదువు నిమిత్తం పేదరికం అడ్డుకాకూడదని, కులమతాలకతీతంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. డాక్టర్ ఆలాతో పాటు, ఇరువురు దాతలు రూ.15 వేలు అందజేసినట్లు విద్యార్థిని తండ్రి మల్లయ్య తెలిపారు. దాతలకు కృతజ్ఞతలు చెప్పారు.
‘సాక్షి’ కథనంపై స్పందించిన
డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు


