క్వారీ గోతిలో పడి మృతి చెందినట్లు నమ్మించే యత్నం మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
మంగళగిరి రూరల్: కేసుల సత్వర పరిష్కారంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక వేడుకలను మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని సమాచార కమిషన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2026 జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 7,034 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించిందని తెలిపారు. ప్రస్తుత కమిషనర్లు ఇప్పటివరకు 10 వేల కేసులను పరిష్కరించారని ప్రశంసించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్లు చావలి సునీల్, డాక్టర్ రెహానా బేగం, గాజుల అదెన్న, డాక్టర్ అల్లారెడ్డి ఉదయభాస్కరరెడ్డి, శరత్‌చంద్ర కల్యాణ్ చక్రవర్తి వట్టికూటి, వంటేరు రవిబాబు, పి.ఎన.నాయుడు, కమిషన్‌న్ కార్యదర్శి సీహెచ్.పద్మావతి దేవి, ఉప కార్యదర్శి కె.నరసింహారావు, లా సెక్రటరీ వి.రఘురామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యువకుడిని స్నేహితులే హతమార్చారు..
చేబ్రోలు: యువకుడిని పథకం ప్రకారం స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాజవరపు నాగేశ్వరరావు(21) ఆదివారం హత్యకు గురైన విషయం విధితమే. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగేశ్వరరావు స్నేహితులు అదే గ్రామానికి చెందిన గంజి సుబ్బారావు, ఆలకుంట దుర్గాప్రసాద్ స్నేహితులు. వీరి ముగ్గురూ కలిసి తాపీ పనికి వెళ్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు.
పథకం ప్రకారమే హత్య...
ఆదివారం ద్విచక్ర వాహనంపై నాగేశ్వరరావును అనుమానితులు సుబ్బారావు, దుర్గాప్రసాద్ తీసుకువెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. గ్రామ శివారు ప్రాంతంలో నాగేశ్వరరావుపై దాడి చేశారు. అనంతరం నాగేశ్వరరావును గ్రామ శివారులోని క్వారీ గోతి వద్దకు తీసుకెళ్లి దస్తులు అన్నీ తీసివేసి నగ్నంగా మృతదేహాన్ని అందులో పడేసి ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. హత్య చేసిన అనంతరం నాగేశ్వరరావు ఈత వేయటానికి వెళ్లి, చేపలు పట్టడానికి వెళ్లి పొరపాటున పడి మునిగి చనిపోయాడని ప్రచారం చేయడం ప్రారంభించారు.
అనుమానాస్పద మృతిపై ప్రచారంతో..
నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి చెందినట్లు ప్రచారంతో పోలీసులు స్పందించారు. విచారణ కోసం నిందితులైన సుబ్బారావు, దుర్గాప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో బంధువులు, మహిళలు అడ్డుకుని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మృతుడి తల్లి రాజవరపు అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొన్నూరు రూరల్ సి.ఐ పి.కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనితో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, వాగ్వాదానికి దిగిన మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు వార్డు కార్యదర్శుల సస్పెన్షన్
నెహ్రూనగర్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు అడ్మిన్ కార్యదర్శులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఆర్‌పీ విధానంలో ఆస్తిపన్ను సేవలను గడువు దాటినా పెండింగ్‌లో ఉంచిన ఆటోనగర్–02 సచివాలయ కార్యదర్శి డి.పద్మావతి 103 దరఖాస్తులను, కొండవారివీధి–03 సచివాలయ కార్యదర్శి కె. సుందర్ సింగ్ 58 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరికి జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో, ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో వీరు గుంటూరు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజా సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.


