కత్తి, చాకుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి బెదిరింపులు రూ.50 వేల నగదు, కత్తులు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం నార్త్ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు వెల్లడి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కత్తి, చాకుతో బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ.65 వేలు దోచుకున్న కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6, 10 తేదీల్లో జరిగిన ఘటనలకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. విశ్రాంతి సమయంలో బయటకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఐదుగురు వ్యక్తులు అడ్డగించి, కత్తితో బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ ఖాజావలి, క్రైమ్ టీమ్ సిబ్బంది ప్రసాద్, జోసెఫ్ తదితరులు సాంకేతిక ఆధారాలు, ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించగా అక్బర్ బాషా, ఇంద్రనీల్, తుమ్మల మహేష్, యశ్వంత్, శివసాయిలను నిందితులుగా గుర్తించారని తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.50 వేలు, నేరానికి ఉపయోగించిన కత్తులు, చాకు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అక్బర్ బాషాపై గతంలో సుమారు 14 కేసులు ఉన్నాయని, వాటిలో రెండు గంజాయి కేసులని డీఎస్పీ పేర్కొన్నారు. ఇంద్రనీల్‌పై మూడు కేసులు ఉండగా, వాటిలో గంజాయి కేసులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై సంబంధిత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారి విషయంలో షీట్లు తెరుస్తామని పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐలు ఖాజావలి, ప్రదీప్ పాల్గొన్నారు.


